ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులను డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) తెలిపింది. నవంబరు 1న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. 2022 నవంబరు 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2023 జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించగా.. మొత్తం 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అందులో 91,507 మంది మాత్రమే దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలకు అన్లైన్లో స్టేజ్-2 అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నారని.. మిగిలిన వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని బోర్డు తెలిపింది. నవంబర్ 11 వ తారీకు నుంచి నవంబర్ 21వ తారీకు వరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ ఈవెంట్స్ డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.